ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్ లో ఉంటుంది. కాలుష్యంతో స్కూళ్లకు సెలువులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే చాలా మంది ఢిల్లీని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు పెరిగిపోతుండటంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలో రెండు, మూడు రోజులకు మించి ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఫరీదాబాద్-నోయిడా ఎయిర్ పోర్టు రోడ్డులో ‘ఏక్ పెడ్ మా కే నామ్ 2.0’ పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం డ్రైవ్‌లో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దఎత్తున మొక్కలపెంపకం డ్రైవ్‌లను చేపట్టడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.
‘‘నేను రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఢిల్లీలో ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటా. నేను ముందే రిటర్న్ టికెట్లను బుక్ చేసుకుంటా. ప్రజలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం తగ్గింది. వాహనాలకు వినియోగించే ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలందరి ప్రధాన బాధ్యత’’ అని గడ్కరీ అన్నారు.