ఉగ్రవాదం అంతానికి భారత్ ఎంత దాకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ టెర్రిరిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ అనంతరం ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ లో పర్యటించారు. ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దులో భద్రతా ఏర్పాట్లో సమీక్షించారు. అనంతరం బదామీ బాగ్ కంటోన్మెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన సైనికులు, పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. పహల్గామ్ లో మరణించిన అమాయక పౌరులకు కూడా నేను గౌరవం అర్పిస్తున్నాను. గాయ పడిన సైనికుల పరాక్రమానికి కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను మరియు వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ చేపట్టిన అతి పెద్ద ఆపరేషన్ అని అన్నారు. అణ్వాయుధాలున్నాయనే విషయాన్ని కూడా పట్టించు కోకుండా భారత సైన్యం ధైర్యంగా ముందుకు సాగిందని చెప్పారు. అణ్వాయుధాల పేరుతో భారత్ ను పాకిస్తాన్ ఎంతగా బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. వాళ్లు చాలా కాలంగా చెబుతున్న అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా..? అని రక్షణ మంత్రి ప్రశ్నించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు.