YAMUNA: ఢిల్లీకి మళ్లీ డేంజర్ బెల్స్.. మహోగ్రంగా యమునా
మరోసారి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా.... పాత రైల్వే వంతెనపై రాకపోకలు నిలిపివేత..;
ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో దిల్లీ(delhi)లో యుమునా నది( Yamuna river) మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్(Uttarakhand and Himachal Pradesh) లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా...... హత్నికుండ్ బ్యారేజ్( Hathnikund barrage) నుంచి నదిలోకి నీటిని విడుదల చేయడంతో యమునకు భారీగా వరద వస్తోంది.
దిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా 206.42 మీటర్ల ఎత్తు(water level)లో ప్రమాదకరస్థాయి(danger mark)ని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో రైల్వే వంతెన(Old Railway Bridge )పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దిల్లీ -షాహదారా మధ్య రాకపోకలు నిలిపేశామని, రైళ్లు న్యూదిల్లీ మీదుగా మళ్లించామని వివరించారు. నది నీటిమట్టం పెరగుతుండడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభావం పడుతోందని దిల్లీ యంత్రాంగం తెలిపింది. సోమవారం ఉదయం గంటలకు యమునా నది నీటిమట్టం 206.54 మీటర్లకు పెరిగిందని
కేంద్ర జల కమిషన్ CWC వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటలకు 205.02 మీటర్లు ఉన్న ప్రవాహం... ఉదయానికి 260 మీటర్లు దాటిందని వెల్లడించింది. ఇవాళ సాయంత్రం కల్లా యమునాలో నీటి ఉద్ధృతి తగ్గే అవాకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూలై 25 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ IMD హెచ్చరికలతో ఢిల్లీ వణికిపోతోంది. హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా వరద పోటెత్తితే దేశ రాజధాని మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా దిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది.
హత్నికుండ్ బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించింది. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసినట్టు అధికారులు తెలిపారు. యమునా నదిలో నీటి విడుదల పెరగడంతో గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలన హిందోన్ వెంబడి లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేశారు.