Maharashtra: నీట్‌లో 99.99 శాతం.. అడ్మిషన్ రోజే యువకుడు ఆత్మహత్య
‘నేను డాక్టర్ కావాలనుకోవడం లేదు’ అంటూ విద్యార్థి ఆత్మహత్య
అతడు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో మంచి ర్యాంక్ సంపాదించాడు. కానీ ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు కాలేజీలో చేరాల్సిన రోజే ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ అనే విద్యార్థి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు ఇటీవలే ఇంర్మీడియట్ పూర్తిచేశాడు. ఆపై కుటుంబసభ్యుల కోరిక మేరకు ఎంబీబీఎస్ చదవడం కోసం నీట్ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో అతడు 99.99 పర్సంటైల్‌తో ఓబీసీ కేటగిరీలో ఆలిండియా 1475 ర్యాంక్ సాధించాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోరక్‌పూర్‌లోని ఓ మెడికల్ కాలేజీలో అతడికి సీటు వచ్చింది. అతడిని కాలేజీలో చేర్పించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. కాలేజీ నుంచి అడ్మిషన్ డేట్ కూడా వచ్చింది. ఏమయ్యిందో ఏమోగానీ అదేరోజు అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నేను డాక్టర్ కావాలనుకోవడం లేదు’ అని సూసైడ్ నోట్ రాసి అతడు ఉసురు తీసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.