జికా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పుణేలో 27కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అరుదైన మెదడు పొరల వాపు సమస్యను వైరస్ సోకిన ఒకరిలో గుర్తించారు. మనదేశంలో జికా ఇన్‌ఫెక్షన్‌తో ఈ సమస్య తలెత్తటం ఇదే తొలిసారి. ఇది సోకిన గర్భిణులకు పుట్టే శిశువుల్లో మెదడు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటోంది. పిల్లలు చిన్న తలతో పుడుతున్నారు. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జికా ఇన్‌ఫెక్షన్‌లో కొందరికి.. అదీ స్వల్పంగా జ్వరం రావొచ్చు. ఒంట్లో నలతగా అనిపించొచ్చు. కొందరికి మాత్రం లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. జ్వరం, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, చర్మం మీద దద్దు కనిపిస్తాయి. దీన్ని డెంగీ జ్వరంగానూ పొరపడుతుంటారు. ప్రస్తుతం డెంగీ కూడా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్త అవసరం. సాధారణంగా దోమ కుట్టిన 3-14 రోజుల్లో దీని లక్షణాలు బయటపడుతుంటాయి. సుమారు 2-7 రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి.