విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న పరిస్థితులు తెలుసుకునేందుకు తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ మేం గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లాం. వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్లాలని నాకు సూచించారు. అక్కడ ఎలాంటి ఎలివేటర్లు లేవు. లిఫ్ట్‌కు అనుమతి లేదని తెలిసి.. మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్లద్వారం వద్దే ఎదురుచూడాల్సిన పరిస్థితి. పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించాను. మాల్స్ కూడా వారిపై మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.