పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ PHC డాక్టర్లు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా PHC వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. దీంతో విజయవాడలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు శనివారం అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ తెలిపారు. ఏపీ ఎన్‌జీవో, స్టాఫ్ నర్స్, సీహెచ్వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా ఈ నిరసనకు సపోర్ట్ ఇచ్చాయి. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని పీహెచ్సీ వైద్యులు స్పష్టం చేశారు. పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను తెచ్చినట్టు వారు గుర్తు చేశారు.