Chandrayaan 4: 2027లో చంద్రయాన్-4
2026లో సముద్రయాన్ ∙కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడి;
చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం 2027లో జరుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలంలోని శిలలను భూమికి తేవడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ ప్రయోగం వచ్చే ఏడాది జరుగుతుందన్నారు. భారతీయ వ్యోమగాములను ప్రత్యేకంగా రూపొందించిన రోదసినౌకలో దిగువ భూ కక్ష్యలోకి తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం లక్ష్యమని తెలిపారు.
అదేవిధంగా సముద్రయాన్‌ను కూడా వచ్చే సంవత్సరమే నిర్వహిస్తామన్నారు. దీనిలో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్రం అడుగున 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, పరిశోధనలు జరుపుతారని చెప్పారు. సముద్రయాన్ వల్ల ముఖ్యమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర సంబంధిత జీవ వైవిధ్యం వంటివాటి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు.