PM Mette Frederiksen: ఎన్నికల వేళ డెన్మార్క్ ప్రధానిపై దుండగుడి దాడి
ఇలాంటి దాడులను సమర్థించబోమన్న భారత ప్రధాని మోదీ;
డెన్మార్క్ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ‘‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతి చెందారు’’ అని ప్రెడెరిక్సన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దాడిలో ప్రధాని గాయపడ్డారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రెడెరిక్సన్‌పై దాడిని ఎన్డీయే నేత మోదీ ఖండించారు. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందని వెల్లడించారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని మోదీ స్పష్టం చేశారు. మిత్రురాలు మెట్టే ఫ్రెడరిక్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.