Earthquake : ఇండోనేషియాని వణికించిన భారీ భూకంపం..
వారం వ్యవధిలో రెండోసారి
ఇండోనేషియా ని మరోసారి భారీ భూకంపం వణికించింది. సులవేసి ద్వీపం లో బుధవారం ఉదయం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఈ భూకంపం ధాటికి ఉత్తర తీరంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిసింది. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వారం రోజుల్లో ఇండోనేషియాలో భూమి కంపించడం ఇది రెండోసారి. గతవారం మలుకు దీవుల సమీపంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా బుధవారం కూడా మరోసారి అదే స్థాయిలో భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.