Consumer commission: కస్టమర్ల ఫోన్ నంబర్లను దుకాణదారులు తీసుకోరాదు
వినియోగదారుల కమిషన్ తీర్పు;
రిటైల్ దుకాణదారులు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకోరాదని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, చండీగఢ్ బెంచ్ తీర్పు చెప్పింది. అడ్వకేట్ పంకజ్ చంద్‌గోథియా ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. తాను 2024 ఏప్రిల్‌లో చెప్పులు కొన్నానని, దుకాణదారు బిల్లు ఇస్తాననే నెపంతో తన ఫోన్ నంబరును తీసుకున్నారని చెప్పారు. ఇది సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అని వాదించారు. విలువలు పాటించనివారికి తన సమాచారం అందుబాటులో ఉందన్నారు.
వినియోగదారుల శాఖ 2023 మే 26న జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఓ ఉత్పత్తిని అమ్మేటపుడు, ఫోన్ నంబర్లను చెప్పాలని కస్టమర్లను అడగటం, దానిని తప్పనిసరి అవసరంగా చెప్పటం, కస్టమర్ల హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పినట్లు తెలిపారు. దీనిపై బెంచ్ తీర్పు చెప్తూ, తక్షణమే పంకజ్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. నష్టపరిహారంగా రూ.2,500 చెల్లించాలని తెలిపింది.