విశ్వ క్రీడల్లో రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ విచారణ జరపనుంది. అయితే దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు. అంపైర్ తీర్పునకు సమయం ఆసన్నమైందన్న ఆయన.. వినేశ్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దామంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రతి ఆటలోనూ నియమాలుంటాయని... వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛమైన ఆటతీరుతో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు అర్హత సాధించిందని... ఫైనల్స్‌కు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేసి రజత పతకానికి దూరమైందన్నారు. ఇందుకు సహేతుక కారణం కనిపించకపోవడంతోపాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లేనని సచిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలకు పాల్పడి అనర్హతకు గురయ్యారంటే దాన్ని వేరేలా చూడాలని.. కానీ వినేశ్ మాత్రం న్యాయంగా ఆడుతూ.. ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుందని గుర్తు చేశారు. ఆమె కచ్చితంగా రజత పతకానికి అర్హురాలేనని తేల్చి చెప్పారు.