వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట ఓ మహిళ హల్‌చల్ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ జగన్ ఇంటి ఎదుట అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమరెడ్డి ఈ నెల 6న తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు చేరుకుంది. జగన్‌తో కలిసి ఫొటో దిగే వరకు వెళ్లేదే లేదని అక్కడ ఉన్న సిబ్బందికి తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను లోపలికి అనుమతించి జగన్‌తో ఫొటో తీయించారు. తర్వాత తనకు అప్పులు ఉన్నాయని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని అంజమరెడ్డి కోరినట్లు తెలిసింది. వారు నిరాకరించడంతో బయటకు వచ్చి గేటు వద్ద అడ్డుగా కూర్చొంది. అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కల్యాణ్‌రాజు ఆ ప్రాంతానికి చేరుకుని మహిళా పోలీసులతో ఆమెను వాహనంలో స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన తర్వాత ఆమెను విడుదల చేశారు.