ABHISHEK: అభిషేక్ విధ్వంసం.. భారత్ శుభారంభం
తొలి టీ 20లో టీమిండియా విజయం... కివీస్ బౌలర్లను చితకొట్టిన అభిషేక్ శర్మ.. మెరుపులు మెరిపించిన రింకూ సింగ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ చేజారిన నిరాశ నుంచి బయటపడిన భారత జట్టు.. టీ20 ఫార్మాట్లో మాత్రం తన అసలైన బలాన్ని మరోసారి చాటుకుంది. ప్రపంచకప్‌కు ముందు కీలకంగా భావిస్తున్న అయిదు టీ20ల సిరీస్‌లో ఆరంభమే ప్రత్యర్థికి గట్టి సందేశం ఇచ్చింది. బ్యాటింగ్‌లో విధ్వంసం, బౌలింగ్‌లో క్రమశిక్షణ, ఫీల్డింగ్‌లో చురుకుదనం—మూడింట్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చూపిస్తూ న్యూజిలాండ్ జట్టుపై 48 పరుగుల ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించడమే కాకుండా, అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌కి అసలైన హైలైట్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. తొలి ఓవర్లోనే సిక్స్‌తో ప్రత్యర్థి బౌలర్లపై దాడికి తెరలేపిన అతడు.. ఆ తర్వాత మరింత వేగం పెంచాడు. కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ భారత్ భారీ స్కోరుకు బాటలు వేసింది. మరోవైపు మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ మరోసారి ఫినిషర్‌గా తన విలువను నిరూపించాడు. చివరి ఓవర్లో మెరుపు షాట్లతో 44 పరుగులు (నాటౌట్) చేసి స్కోరును 238కి చేర్చాడు.
భారత్ ఇన్నింగ్స్ తడబాటుతోనే మొదలైంది. రెండో ఓవర్లో సంజు శాంసన్ వెనుదిరగగా, రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. సూర్య కూడా పేలవ ఫామ్ నుంచి బయటపడినట్టే కనిపించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 68/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. కివీస్ బౌలర్లు వికెట్లు తీయడంతో కొంత బ్రేక్ పడినట్టే అనిపించినా, స్కోరు వేగం తగ్గలేదు.
సూర్య, అభిషేక్ వరుస ఓవర్లలో ఔటవడంతో ఒక దశలో భారత్ కాస్త నెమ్మదించినా, హార్దిక్ పాండ్య వచ్చాక మళ్లీ రన్‌రేట్ పెరిగింది. హార్దిక్ దూకుడుగా ఆడి 25 పరుగులు జోడించాడు. చివర్లో రింకు సింగ్ విధ్వంసంతో భారత్ 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో రెండు వికెట్లు తీసినా, భారీ స్కోరును అడ్డుకోలేకపోయారు. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కుదేలైంది. తొలి ఓవర్లోనే డెవాన్ కాన్వే డకౌట్ కాగా, వెంటనే రచిన్ రవీంద్ర కూడా వెనుదిరిగాడు. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో కివీస్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్ ఒంటరిగా పోరాటం ప్రారంభించాడు. టిమ్ రాబిన్సన్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 50/2కు చేరినా, అవసరమైన రన్‌రేట్ మాత్రం అదుపులోకి రాలేదు.
ఫిలిప్స్ తన సహజ దూకుడును ప్రదర్శిస్తూ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్‌లు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. మార్క్ చాప్మన్ కూడా మంచి సహకారం అందించాడు. అయితే వరుస ఓవర్లలో ఫిలిప్స్, చాప్మన్ ఔటవడంతో కివీస్ ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ తర్వాత డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ కొంత పోరాటం చేసినా, ఓటమి తేడాను మాత్రమే తగ్గించగలిగారు. భారత బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనే విజయానికి కారణమైంది. వరుణ్ చక్రవర్తి రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పగా, శివమ్ దూబె కూడా కీలక బ్రేక్‌లు అందించాడు. సంజు శాంసన్ అందుకున్న అద్భుత క్యాచ్ మ్యాచ్ ఆరంభంలోనే కివీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.