ASIA CUP: ఆసియా కప్ వేదికగా పాకిస్థాన్ డ్రామాలు
మ్యాచ్ బహిష్కరిస్తామంటూ ప్రగల్భాలు.,..ఐసీసీ హెచ్చరికలతో దిగొచ్చిన పాకిస్థాన్... మ్యాచ్ రిఫరీ సారీ చెప్పారంటూ ప్రకటన.. సారీ వీడియో అంటూ నెట్టింట పాక్ పోస్ట్
ఆసియా కప్ 2025లో అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు హైడ్రామా చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరగాల్సిన మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రావాల్సి ఉండగా ఆటగాళ్లు అందరూ హోటల్ రూమ్‌కే పరిమితమైంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వని కారణంగా పాకిస్థాన్ జట్టు ఈ విధంగా నిరసన తెలిపింది. మ్యాచ్ కు మొదట పాకిస్తాన్ జట్టు దూరంగా ఉందని అందరు భావించారు. అయితే, ఇక్కడ ఓ కొత్త ట్విస్ట్ జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. పాకిస్తాన్ జట్టు మళ్లీ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడి గెలిచి సూపర్ 4కు చేరుకుంది.
వందల కోట్ల జరిమానా భయం.!
మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని లేకపోతే తాము ఆడబోమని భీష్మించుకుని కూర్చున్న పాక్ చివరికి .. చెరువు మీద అలిగితే తమకే కష్టమనే నిర్ణయానికి వచ్చి మ్యాచ్ ఆడి గెలిచింది. మ్యాచ్ రిఫరీని కనీసం తమ మ్యాచ్ కు తొలగించపోయినా సరే వచ్చి మ్యాచ్ ఆడింది. మ్యాచ్ రిఫరీ సారీ చెప్పాడని చెప్పి మ్యాచ్ కు హాజరైంది. యూఏఈతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయింది. రిఫరీతో సారీ చెప్పించినా సరేనని పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. రిఫరీ .. దానికి అఅంగీకిరంచడంతో పాకిస్తాన్ టీమ్ స్టేడియానికి వచ్చింది. పాక్ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ రూ.100 కోట్ల జరిమానా ఎదుర్కోనుందన్న వార్తలు కూడా వచ్చాయి. మ్యాచ్ తర్వాత, భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు టీమ్ మొత్తం పాక్ ప్లేయర్లతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం వివాదాస్పదమైంది.
రంగంలోకి దిగిన ఐసీసీ
యూఏఈతో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించనుందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా.. మ్యాచ్ రెఫరీగా పైక్రాఫ్ట్ కొనసాగుతాడని మరోసారి స్పష్టం చేశాడు. అతడు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని గుర్తు చేశాడు.పైక్రాఫ్ట్‌ను కూడా హెడ్ క్వార్టర్స్‌కు పిలిపించిన ఐసీసీ.. అతని విషయంలో పూర్తిగా విచారణ చేసినట్టు రాతపూర్వకంగా పీసీబీకి తెలియజేసింది. ఈ క్రమంలో పలుమార్లు నఖ్వీతో మంతనాలు జరిపిన పాక్ జట్టు చివరకు స్టేడియానికి చేరుకొంది. దీంతో మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. మరోవైపు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకొన్న పరిణామాలపై పాక్ మేనేజర్‌ను పైక్రాఫ్ట్ క్షమాపణలు కోరినట్టు పీసీబీ ఎక్స్‌లో పోస్టు చేసింది. కాగా, మ్యాచ్‌ను బహిష్కరిస్తే భారీ జరిమానాలు తప్పవన్న భయంతోనే పాక్ దారికొచ్చినట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో యూఏఈపై 41 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాకిస్థాన్ గ్రూప్ ఏలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి సూపర్ 4లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. దీంతో భారత్ తో పాక్ ఈ నెల 21వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది.