Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ-లంక చేతిలో బంగ్లా చిత్తు

ఆసియా కప్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం... తోక ముడిచిన బంగ్లా పులులు..

Update: 2023-09-01 00:45 GMT

 ఆసియా కప్‌ టోర్నీ (Asia Cup 2023)లో భాగంగా బంగ్లాదేశ్‌‍ (Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka) సత్తా చాటింది. గాయాల కారణంగా స్టార్‌ ఆటగాళ్లు దూరమైనా డిపెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన లంక... ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి(defeated Bangladesh by five wickets) ఆసియాకప్‌లో బోణి కొట్టింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 162 పరుగులకు ఆలౌటైంది. ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్లను లంక బౌలర్లు( Sri Lankan bowlers) చుట్టేశారు.


IPL ప‌ద‌హారో సీజ‌న్ హీరో యార్కర్ కింగ్ మతీశ‌ ప‌తిరణ(Matheesha Pathirana ) ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియ‌న్ చేరారు. నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించిన పతిరణ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. తీక్షణ తన స్పిన్‌ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 8 ఓవర్లు వేసిన తీక్షణ 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ధనంజయ డిసిల్వ , దునిత్‌ వెల్లలగే, కెప్టెన్‌ షనక ఒక్కో వికెట్‌ తీయడంతో బంగ్లాదేశ్‌ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో( Najmul Hossain Shanto) ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. అతడు ఆదుకోకపోతే బంగ్లా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నజ్ముల్ 122 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. శాంటో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చడంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేసింది. తౌహిద్‌ హ్రిదోయ్‌ 20, ఓపెనర్‌ మొహమ్మద్‌ నైమ్‌ 16, ముష్ఫికర్‌ రహీమ్‌ 13 మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగిలిన వారంతా సింగిల్‌ డిజిట్‌కే పెవిలీయన్‌ చేరారు.


అనంతరం 165 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో లంక త‌డ‌బ‌డింది. ఆరంభంలోనే ఓపెన‌ర్లు దిముత్ క‌రుణ‌ర‌త్నే(1), ప్రథుమ్ నిస్సంక‌(14) వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే స‌మ‌ర‌విక్రమ‌, అస‌లంక కీల‌క భాగ‌స్వామ్యంతో లంక‌ను ఆదుకున్నారు.

చరిత్ అసలంక అజేయంగా 62 పరుగులు, సదీర సమరవిక్రమ 54 పరుగులతో లంకను విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 2, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మెహిదీ హసన్ ఒక్కో వికెట్‌ తీశారు.  

Tags:    

Similar News