ASIA CUP: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా
నేడు ఒమన్‌తో భారత్ నామమాత్రపు పోరు.. ఇప్పటికే సూపర్ 4 చేరిన టీమిండియా.. బుమ్రాకు రెస్ట్.. బరిలో హర్ష్‌దీప్ సింగ్.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని టాక్
ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇప్పుడు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో నేడు తలపడనుంది. ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-4లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత జట్టు, ఒమన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి.. బెంచ్ పై ఉన్నవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌లో భారత్.. బ్యాటింగ్ డెప్త్‌పై ఫోకస్ చేసింది. 8 మంది బ్యాటర్లను తుది జట్టులోకి తీసుకుంది. కానీ ఒమన్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒమన్ జట్టు భారత్‌కు పోటీ ఇచ్చే కూడా అవకాశం లేదు. అందువల్ల విజయం లాంఛనమే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
బుమ్రాకు విశ్రాంతి
ఒమన్‌తో జరిగే మ్యాచులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసియాకప్ తర్వాత భారత్.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు బుమ్రాను ఫ్రెష్‌గా ఉంచేందుకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. బుమ్రా ప్లేసులో టీ20 స్పెషలిస్ట్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదే జరిగితే ఆసియాకప్ 2025లో అర్షదీప్ సింగ్‌కి ఒమన్‌తో మ్యాచే తొలి మ్యాచ్ అవుతుంది. ఈ మార్పు మినహా తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పదే పదే తుది జట్టు మార్చడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే విన్నింగ్ జట్టును కొనసాగించేందుకే మొగ్గు చూపొచ్చు. కానీ బుమ్రాకు మాత్రం దీని నుంచి మినహాయింపు దొరికే అవకాశం ఉంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్టైల్ ప్రకారం.. విన్నింగ్ జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే, అభిషేక్ శర్మలకు ఎలాంటి విశ్రాంతి ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు
రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ అద్భుత విజయాలు సాధించి, టైటిల్ ఫేవరెట్ పేరుకు న్యాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. అయితే సంజూ శాంసన్ స్థానంలో ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన గిల్ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తను త్వరగా ఔటయ్యాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశముంది. దీంతో ఓపెనర్ గా సంజూ బరిలోకి దిగే అవకాశముంది. అలాగే మరో బ్యాటర్ గా ఫినిషర్ రింకూ సింగ్ కు తుది జట్టులో ఆడే అవకాశముంది. అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చి, హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలను తోసిపుచ్చలేం. ఇక సూపర్-4 షెడ్యూల్లో భాగంగా ఈనెల 21, 24, 26లలో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో కనీసం రెండు గెలిచినట్లయితే, ఫైనల్ కు చేరే అవకాశముంది. అయితే సూపర్ 4లో పాకిస్థాన్-భారత్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది.