DHONI: ఐపీఎల్ బరిలోకి దిగేందుకు తలా సిద్ధం
ధోనీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్... ఐపీఎల్ 2026లో బరిలో దిగనున్న ధోనీ... అధికారిక ప్రకటన చేసిన చెన్నై సీఈవో
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ధోనీ మాతో మాట్లాడారు.. ఆయన వచ్చే సీజన్‌కి అందుబాటులో ఉంటారని తెలిపారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెన్నెముకలాంటివాడు.. ఆయన నాయకత్వంలో సీఎస్కే ఐదు సార్లు టైటిల్ సాధించి రికార్డు సృష్టించింది అన్నారు. ఇక, 2025 ఐపీఎల్ సీజన్లో సీఎస్కె జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.
ఇప్పటికే చర్చలు షురూ...
నవంబర్ 15న రిటెన్షన్ గడువుకు ముందే ట్రేడ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ 2-026 సీజన్ కోసం ప్రణాళికలు రూపొందించడానికి చెన్నై సూపర్ కింగ్స్ నవంబర్ 10, 11 తేదీలలో ఒక సమావేశాన్ని నిర్వహించనుంది. సీఈవో కాశీ విశ్వనాథ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు ధోనీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఋతురాజ్ గాయం కారణంగా టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకోవడంతో మిగిలిన మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ 2008 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ మధ్యలో రెండు సీజన్ (2016,2017)ల పాటు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ తరపున 30 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ధోని పెద్దగా రాణించలేదు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 24.50 సగటుతో 196 పరుగులు చేశాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. గత సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కు CSK కెప్టెన్సీని అప్పగించాడు.
జట్టు కూర్పుపై దృష్టి
ధోనీ అందుబాటులో ఉండటం ఖాయం కావడంతో, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రాబోయే ఐపీఎల్ 2026 కోసం తమ జట్టు కూర్పుపై దృష్టి సారించింది. టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సీఈఓ, ఇతర అధికారులు నవంబర్ 10, 11 తేదీల్లో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే వేలానికి ముందు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలనే దానిపై చర్చ జరగనుంది. అంతేకాకుండా, సంజు శాంసన్ ట్రేడ్ డీల్‌పై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురూ చర్చించనుండగా.. తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఈ సీజన్లో సత్తా చాటాలని చూస్తోంది.