తొడ కండర గాయంతో ఇబ్బందిపడుతున్న ధోనీ త్వరలోనే లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుంటారని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ధోనీ కోలుకోవడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిపాయి. ఆ తర్వాత అతను తన భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే గాయంతో ఇబ్బంది పడుతున్న ధోనీ.. మరో కీపర్ కాన్వేకి కూడా గాయం కావడంతో తప్పని పరిస్థితిలో ఈ సీజన్ ఆడాల్సి వచ్చింది.
ఐపీఎల్-17లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ నుంచే ఇంటి దారి పట్టింది. బెంగళూరు చేతిలో ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ సీజన్ అతనికి చివరదంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బెంగళూరు మ్యాచ్ అనంతరం అతను వీడ్కోలు పలుకుతాడని అంతా భావించినప్పటికీ అతను ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నయ్ ఫ్రాంచైజీ వర్గాలు స్పందించాయి. ‘తాను వైదొలుగుతున్నట్టు ధోనీ సీఎస్కేలో ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని మాత్రమే మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అతనితో మాట్లాడేందుకు వేచి చూస్తున్నాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి. శస్త్ర చికిత్స నుంచి కోలుకున్న తర్వాతే తన భవిష్యత్తుపై ధోనీ నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.