Dwayne Bravo : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్​గా బ్రావో

Update: 2024-09-27 11:15 GMT

డ్వేన్ బ్రావో క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవక ముందే అతడిని మెంటార్‌ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్ లో ఆడుతూ గాయపడిన విండీస్‌ దిగ్గజం ఆటకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కొద్ది సమయంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2025 సీజన్‌కు మెంటార్‌గా నియమిస్తున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. గత సీజన్‌లో గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఛాంపియన్‌గా నిలిపాడు. అతడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రావడంతో ఖాళీ ఏర్పడింది. ఆ లోటును డ్వేన్ బ్రావోతో పూరిస్తున్నట్లు కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూరు వెల్లడించారు. ‘‘ట్రినిడాడ్ నైట్ రైడర్స్‌కు దాదాపు పదేళ్లపాటు ఆడా. కేకేఆర్‌పై ఎన్నో మ్యాచుల్లో పోరాడా. ఆ ఫ్రాంచైజీపై నాకెంతో గౌరవం ఉంది. ఆటపై మేనేజ్‌మెంట్‌కు ఉన్న అభిరుచి అద్భుతం. కుటుంబం లాంటి వాతావరణం ఉండటం కలిసొచ్చే అంశం. క్రికెటర్‌ పాత్ర నుంచి మెంటార్‌గా మారేందుకు చక్కని వేదికగా కేకేఆర్‌ను అనుకుంటున్నా. ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు.

Tags:    

Similar News