బుమ్రాను జిమ్మీ బూతులు తిట్టాడు..ఆ మాటతోనే మాలో జ్వాల రగిలింది
Bumrah vs Anderson: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.;
Bumrah vs Anderson: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా , ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల దాడి జరిగింది. దీనిపై వివరణ ఇచ్చాడు జిమ్మీ. ఈ మ్యాచులో బుమ్రా తనను ఔట్ చేసేందుకు ప్రయత్నించలేదని అండర్సన్ అంటున్నాడు. బుమ్రా బౌన్సర్లు సంధించాడని గుర్తుచేశాడు.
' బుమ్రా సాధారణ వేగం కన్నా నెమ్మది బంతులు వేస్తున్నాడని జో రూట్ నాతో చెప్పాడు. కానీ నేను ఎదుర్కొన్న తొలి బంతే 90 మైళ్ల వేగంతో వచ్చింది. పిచ్ నెమ్మదిగా ఉందని చెప్పడంతోనే నేను ఆఫ్‌గార్డ్ తీసుకున్నాను. వారు చెప్పినట్టే పిచ్ నిజంగానే మందకొడిగా ఉంది. అలాంటి బంతిని నేను నా కెరీర్లోనే ఎదుర్కోనట్టు అనిపించింది. అతడు నన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నించడం లేదని అనిపించింది' అని అండర్సన్ అన్నాడు.
'బుమ్రా ఓ ఓవర్ విసిరాడు. అందులో బహుశా 10-12 బంతులు వేశాడనుకుంటా. వరుసపెట్టి నో బాల్స్, షార్ట్‌పిచ్ బంతులు వేశాడు. అతడో రెండు బంతుల్ని స్టంప్స్‌కు సైతం విసిరాడు. వాటిని నేను అడ్డుకొన్నాను' అని అండర్సన్ అన్నాడు. ఆ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బుమ్రాను జిమ్మీ బూతు మాటలు అన్నాడు. నిజానికి ఏం జరిగిందో తనకు తెలియదని బుమ్రా చెప్పాడు.
'అండర్సన్ అనుభవాన్ని ఇంగ్లాండ్ వ్యక్తిగతంగా తీసుకుంది. కానీ మేమంతా ఒక్కచోటకు చేరి అండర్సన్ ఎలాంటి అశ్లీల పదజాలం వాడాడో వివరించాం. అదే మాలో జ్వాలను రగిలించింది. ఇక ఆ తర్వాత జరిగింది అద్భుతమే' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం గమనార్హం. రెండో టెస్టులో అండర్సన్‌కు బుమ్రా 10 బంతులతో కూడిన ఓవర్ విసిరాడు. అందులో ఎక్కువగా బౌన్సర్లే ఉన్నాయి. ఒక బంతి అతడి హెల్మెట్‌కు సైతం తగిలింది. టీమ్‌ఇండియా వ్యూహాలు నచ్చని అండర్సన్.. బుమ్రాను మాటలన్నాడు.