Women's Cricket Record : ఒకే మ్యాచులో నలుగురు సెంచరీలు.. రెండో వన్డేలో అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అరుదైన రికార్డు నమోదైంది. ఈ మ్యాచులో స్మృతి మంధాన(136), హర్మన్‌ప్రీత్ కౌర్(103), లారా(135), కాప్(114) సెంచరీలు నమోదు చేశారు. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో నలుగురు బ్యాటర్లు ఒకే మ్యాచులో సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో SAపై టీమ్ ఇండియా 4 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య రెండో మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే మ్యాచ్ ముగిసే వరకు పట్టు వీడని సౌతాఫ్రికా జట్టు.. చివరికి 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు సెంచరీలతో చెలరేగడంతో 325/3 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికాను 321/6ను కట్టడి చేసింది. దీంతో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్మృతి మంధాన వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా, ఓవరాల్‌గా 10వ మహిళా క్రికెటర్. ఈ 10 మంది ఆటగాళ్లు కలిసి ఇలా 11 సార్లు చేశారు. మంధాన కంటే ముందు, అమీ సటర్త్‌వైట్, జిల్ కెన్నారే, డెబోరా హాకీ, కెఎల్ రోంటన్, మెగ్ లానింగ్, టామీ బ్యూమాంట్, అలిస్సా హీలీ, నేట్ షీవర్ బ్రంట్, ఎల్ వోల్వార్డ్ లు వరుసగా సెంచరీలు సాధించారు.