దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా, ప్రతి ఆటకు ప్రాధాన్యమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని సీఎం తెలిపారు.
యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీ వంటి క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. దేశం, రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి యువత శారీరక నిర్మాణం తీరుకు అనువైన క్రీడలను గుర్తించి, వాటిని ప్రోత్సహించాలని సూచించారు.
20 ఏండ్ల కిందటే హైదరాబాద్ ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిందని.. భవిష్యత్ లో ఒలింపిక్స్ కు వేదికగా సిటీని మార్చాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా రాష్ట్ర యువతను తయారు చేయాలన్నారు. ఆ దిశగా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీర్చిదిద్ది.. అనుభవమున్న కోచ్ లతో శిక్షణ ఇప్పించాలన్నారు.