ind-pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
అధికారికంగా ప్రకటించిన డబ్ల్యూసీఎల్... పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా విముఖత.. పహల్గామ్ దాడి నేపథ్యంలో క్రికెటర్ల నిర్ణయం;
భారత్ - పాకిస్థాన్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దు అయింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నమెంట్లో భాగంగా జరగనున్న ఆ మ్యాచ్‌కు భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆడబోమని ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ నిర్ణయంతో అభిమానులను నిరాశపర్చినందుకు, భారత ఆటగాళ్లకు అసౌకర్యం కలిగించినందుకు నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు.
"మేం WCLలో క్రికెట్‌ను ఎంతో ప్రేమతో నిర్వహిస్తున్నాం. అభిమానులకు మంచి, సంతోషకరమైన క్షణాలను అందించడమే మా ఏకైక లక్ష్యం. ఇటీవల పాకిస్థాన్ హాకీ జట్టు భారతదేశానికి వస్తుందన్న వార్తలు వచ్చాయి. అలాగే భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్‌తో పాటు ఇతర క్రీడల్లో జరిగిన కొన్ని పోటీలను చూశాం. డబ్ల్యూసీఎల్లో కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను నిర్వహించాలని అనకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంతోషకరమైన జ్ఞాపకాలను అందించాలని అనుకున్నాం. కానీ ఈ ప్రయత్నం చాలా మంది భావోద్వేగాలను గాయపరిచినట్టు అనిపిస్తోంది. మేం ఎవరి మనోభావాలను బాధించాలన్న ఉద్దేశంతో చేయలేదు. కానీ ఈ పరిణామాల వల్ల బాధ కలిగించినందుకు చింతిస్తున్నాం" అని డబ్ల్యూసీఎల్ అధికారికంగా వెల్లడించింది. టీమిండియా మాజీ క్రికెటర్లు పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపడమే ఇందుకు కారణమని నిర్వాహకులు తెలిపారు. హర్భజన్, ధావన్, రైనా, యూసుఫ్ పఠాన్ సహా మరికొంత మంది భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి వైదొలిగారు. అయితే భారత్, పాకిస్తాన్ జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారా? లేదా? అన్న దానిపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాయాది పాకిస్థాన్‌తో ఏ క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి స్పష్టం చేసింది. మాజీలు ఆడే డబ్ల్యూసీఎల్లో ఇండో-పాక్ టీమ్స్ తలపడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా మాజీలకు ఎవరు అనుమతి ఇచ్చారు?, దేశం గురించి కాస్తైనా ఆలోచించక్కర్లా? అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. కొందరు ప్లేయర్స్ తాము మ్యాచ్ ఆడలేమని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు ముందే చెప్పారట. చివరకు మ్యాచ్ రద్దు అయింది. నేడు జరిగే మ్యాచ్ రద్దయిందని, డబ్బులు వాపస్ ఇస్తామని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు.