CT2025: ఆస్ట్రేలియాతో అమీతుమీ నేడే

అన్ని విభాగాల్లో పటిష్టంగా టీమిండియా.. నాకౌట్ లో చెలరేగిపోయే ఆస్ట్రేలియా;

Update: 2025-03-04 03:30 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మహా సమరానికి సర్వం సిద్ధమైంది. తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఐసీసీ టోర్నమెంట్‌ లలో సెమీఫైనల్‌లో మూడోసారి భారత్- ఆస్ట్రేలియా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో, ముఖ్యంగా నాకౌట్‌లో చెలరేగిపోయే ఆసీస్‌తో పోరు టీమ్‌ఇండియాకు కచ్చితంగా సవాల్ ఎదురుకానుంది. కానీ వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత జట్టు.. ఈ మ్యాచులోనూ విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తోంది.

బ్యాటింగ్ లో తిరుగుందా..?

ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాక్‌పై సెంచరీతో జట్టును గెలిపించిన కోహ్లి మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రోహిత్‌ సెమీస్‌లో అయినా ఓ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. శ్రేయస్‌ చక్కటి ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మిడిలార్డర్లో హార్దిక్‌ పాండ్యా.. అక్షర్ పటేల్ కూడా ఉన్నారు కాబట్టి టీమిండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇటు బౌలింగ్ లోనూ భారత్‌కు సమస్యలేమీ లేవు. స్పిన్నర్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. పేసర్ల మీద మరీ ఎక్కువ ఆధారపడట్లేదు. బంగ్లాపై 5 వికెట్ల ప్రదర్శన తర్వాత షమి.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్లు తీయలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

టీమిండియాకు "హెడ్" ఏక్ తప్పదా..?

ఛాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశలో ఆస్ట్రేలియా మ్యాచ్‌లు రెండు వర్షార్పణం అయ్యాయి. అనంతరం ఒక్క మ్యాచులో గెలిచి ఆస్ట్రేలియా నాకౌట్ కు వచ్చింది. ఇంగ్లాండ్‌పై 352 పరుగుల భారీ ఛేదనలో ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి ఆ జట్టు అద్భుత పోరాటంతో గెలిచింది. ఆస్ట్రేలియా మ్యాచులో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాలని భారత జట్టు భావిస్తోంది. అయితే భారత జట్టుకు.. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తలనొప్పి తప్పేలా లేదు. వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలవడంలో హెడ్ దే కీలక పాత్ర. దీంతో ఈ నాకౌట్ మ్యాచులో హెడ్ ఏం చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News