IND vs SA: స్పిన్ ఉచ్చులో చిక్కి.. చిత్తుగా ఓడి..
తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం... 124 పరుగులు ఛేదించలేకపోయిన భారత్... 93 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేదించక ముందు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. RSA మొదటి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులతో ఆలౌట్ అయింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి చేరింది.
కష్టతరమైన పిచ్‌పై..
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్ మీద విజయం సాధించింది. కేవలం 124 పరుగులు ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. పిచ్ బౌలర్లకు అనుకూలించింది.ఆతిథ్య భారత్ పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నా, పర్యాటక జట్టు సైతం అదే స్థాయిలో బౌలింగ్ తో రాణించింది. సైమన్ హార్మర్ భారత జట్టును దెబ్బతీశాడు. టీమిండియా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. గత 15 ఏళ్లలో భారత గడ్డపై దక్షిణాఫ్రికా గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఇది కేవలం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కాగా, రెండవ, చివరి మ్యాచ్ నవంబర్ 22న గౌహతిలో ప్రారంభం కానుంది. భారత జట్టు తిరిగి పుంజుకుని సిరీస్‌న్ సమం చేయాలనుకుంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. భారత్ 30 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది, చివరికి 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు, భారత్ ఛేదించడంలో విఫలమైంది.
హార్మర్ పడగొట్టాడు..
లక్ష్యం చిన్నదే అయినా.. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్‌పై ఛేదన తేలికని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ టీమ్ఇండియా తడబాటు, పరాభవం మాత్రం ఊహించనిదే. అయితే స్పిన్నర్లు భారత్ వెన్నువిరిచినా.. మొదట్లో దెబ్బతీసింది మాత్రం పేసర్ యాన్సనే. ఈడెన్‌లో పిచ్ మన స్పిన్నర్లు జడేజా, అక్షర్, కుల్‌దీప్‌లకు సహకరిస్తుందనుకుంటే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ హీరోగా నిలిచాడు. అతడు పడగొట్టిన 8 వికెట్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించాయి. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. సొంతగడ్డపై గత ఆరు టెస్టుల్లో భారత్‌కు ఇది నాలుగో పరాభవం. గత ఏడాది కివీస్ చేతిలో 0-3తో ఓడిన సంగతి తెలిసిందే. తాజా ఓటమితో టర్నింగ్ పిచ్‌లపై ఆడడంలో మన బ్యాటర్ల సమర్థతపై మరోసారి చర్చ మొదలైంది. భారత బ్యాటర్ల ప్రదర్శన అభిమానులకు పెద్ద షాకే. ఒక్క బ్యాటర్ కూడా సాధికారికంగా ఆడలేకపోయాడు. అదే సమయంలో ఆందోళన కలిగించే మరో విషయమేంటంటే.. ఈ నాలుగు ఓటముల్లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లు భారత స్పిన్నర్ల కన్నా మెరుగైన ప్రదర్శన చేశారు.