IND WIN: మ్యాచ్ వర్షార్పణం..సిరీస్ భారత్ కైవసం
వర్షం కారణంగా ఐదో టీ 20 మ్యాచ్ రద్దు.. 4.5 ఓవర్లే సాగిన కీలకమైన ఐదో టీ20... 2-1 తేడాతో సిరీస్‌ను టీమిండియా కైవసం
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా సిరీస్ విజయంతో ముగించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివార జరిగిన ఆస్ట్రేలియా-భారత్ ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఈ ఐదు టీ20ల సిరీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ ఛాంపియన్‌గా టీమిండియా తమ సత్తాను చాటింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని ఈ పర్యటనను ఘనంగా ముగించింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆట ఆగే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (23*; 13 బంతుల్లో 1ఫోర్, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (29*; 16 బంతుల్లో, 6 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. ఆటలో వేగం పుంజుకుంటున్న సమయంలోనే ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా కఠినంగా మారడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తర్వాత వర్షం కూడా ప్రారంభమైంది. ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో కాసేపటి తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ కూడా వర్షార్పణమైన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.
అత్యంత వేగంగా...
తొలి ఓవర్లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్లేన్ మ్యాక్స్‌వెల్ నేలపాలు చేయగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్‌ను ద్వార్షూయిస్ చేజార్చాడు. ఈ రెండు అవకాశాలతో అభిషేక్ శర్మ చెలరేగాడు. క్యాచ్ వదిలిన మరుసటి బంతికే సింగిల్ తీసి టీ20ల్లో 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. గత మూడు టీ20ల్లో పేలవ ఫామ్‌తో సతమతమైన శుభ్‌మన్ గిల్...ఈ మ్యాచ్‌లో మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ తడబడినా వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. వర్షం రాకపోయినా.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో పాటు భారీ ఉరుములతో కూడిన గాలివాన వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపేసారు.