IND vs AUS: కంగారు కోటను బద్దలు కొట్టాల్సిందే
నేడే మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్.. ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ.. వరల్డ్ కప్‌లో జైత్రయాత్ర చేస్తున్న ఆసీస్
మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియా కీలకపోరుకు సిద్ధమైంది. లీగ్ స్టేజ్‌ను అగ్రస్థానంతో ముగించిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అన్ని జట్లను భయపెట్టేలా సాగుతున్న ఆస్ట్రేలియా.. మరో కప్పు దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు కంగారు జట్టుతోనే సెమీస్ లో టీమిండియా తలపడనుంది. కంగారు కోటను బద్దలు కొట్టి తుదిపోరుకు అర్హత సాధించాలని టీమిండియా చూస్తోంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా జట్టుకు ఓటమన్నదే లేదు. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మిగతా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. టోర్నీలో అందరి కంటే ముందుగా సెమీస్ బెర్తును ఆస్ట్రేలియా ఖరారు చేసుకుంది. కంగారు జట్టును ఓడించడం అంత సులువు కాదు. కానీ టీమిండియా తనదైన రోజున ఎంత మంచి జట్టునైనా ఓడిస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో భారత్ తమ అత్యున్నత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంది.
స్టార్లు ఏం చేస్తారో..?
అత్యంత సవాలుతో కూడిన మ్యాచ్‌లో భారత్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రధానంగా ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ల మీదే ఉంది. వీరికి అపార అనుభవం ఉంది. ఆస్ట్రేలియాపై మంచి రికార్డూ ఉంది. స్మృతి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇక హర్మన్ ఇటీవలి ఫామ్ బాలేకున్నా.. కీలక పోరులో ఆమె జోరందుకుంటుందని జట్టు ఆశిస్తోంది. 2017 సెమీస్ ఇన్నింగ్స్‌ను గుర్తు తెచ్చుకుని మరోసారి ఆమె చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. సెమీస్ ముంగిట ఫామ్‌లో ఉన్న ప్రతీక గాయంతో జట్టుకు దూరం కావడం మాత్రం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఆమె ఆసీస్‌పై గ్రూప్ దశలో 75 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడింది. న్యూజిలాండ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జెమీమాపై ఆశలున్నాయి. రిచా ఘోష్, దీప్తి శర్మ సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి అవసరముంది. ప్రప్రంచక్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు అనగానే ఎక్కువమందికి గుర్తుకొచ్చేది 2017 సెమీస్. ఇంకో కప్పు ఖాయమని ధీమాగా ఉన్న కంగారూలకు ఆ మ్యాచ్‌లో భారత్ మామూలు షాక్ ఇవ్వలేదు. మహిళల క్రికెట్ చరిత్రలోనే ఒకానొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అనదగ్గ భారీ శతకం (171 నాటౌట్)తో హర్మన్‌ప్రీత్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 282 లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు.. 245 పరుగులకు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హీలీ వచ్చేస్తోంది..
గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్‌లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు. గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్‌పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసింది.