బిహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను 4-1 గోల్స్ తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత దక్కిన ఈ విజయం యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఈ విజయంతో భారత్ 2026లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. భారత జట్టు అద్భుత ప్రదర్శన, పట్టుదలకు ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. ఈ ఘన విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విజయాన్ని చారిత్రకమైనదిగా అభివర్ణించారు.
సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం కేవలం హాకీ జట్టుది మాత్రమే కాదని, మొత్తం భారతదేశానికి గర్వకారణమైన క్షణమని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఈ విజయాన్ని భారత క్రీడా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. "ఎనిమిదేళ్ల తర్వాత కొరియాపై టైటిల్ సాధించడం గొప్ప విషయం. యువ క్రీడాకారుల పట్టుదలకు, కృషికి ఈ విజయం నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత హాకీ కీర్తిని ఇలాగే కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రపంచకప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.