ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ వెనుదిరగడంతో జట్టు కోచ్ స్టిమాక్‌ను AIFF తప్పించింది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనపై వేటు వేసింది. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది. కాగా కాంట్రాక్ట్‌ను మధ్యలో రద్దు చేసినందుకు స్టిమాక్‌కు AIFF రూ.3 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
క్రొయేసియాకు చెందిన స్టిమాక్ 2019లో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. స్టిమాక్ హయాంలో భారత జట్టు గొప్ప విజయాలు అందుకుంది. రెండుసార్లు శాఫ్ చాంపియన్‌షిప్(2021, 2023), ఇంటర్‌కాంటినెంటల్ కప్, ట్రై నేషన్స్ సిరీస్ కైవసం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఈ నెల 11న జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఖతార్ చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలవడంతో భారత్ తర్వాతి రౌండ్ ఆశలు గల్లంతయ్యాయి.