Yashasvi Jaiswal : విశాఖలో విధ్వంసం సృష్టించిన యశస్వి జైస్వాల్
అరుదైన జాబితాలో చోటు;
టీమ్ఇండియా యువ ఓపెనర్, విధ్వంసకర ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ డబుల్ సెంచరీని బాదాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లతో ద్విశతకాన్ని అందుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో జైస్వాల్‌కు ఇదే మొదటి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో అతడు పలు ఘనతలను అందుకున్నాడు. టీమ్ఇండియా తరుపున డబుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడైన భారతీయ బ్యాటర్‌లలో స్థానం సంపాదించాడు యశస్వి కంటే ముందు వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ ఈ రికార్డును నమోదు చేశారు. యసశ్వి జైస్వాల్ ఒంటరి పోరాటంతో టీమిండియా నాలుగు వందల స్కోరు దిశగా పయనిస్తోంది.
వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషిస్తున్నాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ ద్వి శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నాడు. యశస్వి జైస్వాల్ ద్వి శతకంతో టీమిండియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 280 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్...19 ఫోర్లు, 7 సిక్సులతో 207 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా కుల్‌దీప్ క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అంతేకాదు టెస్టుల్లో డబుల్ సెంచరీ కొట్టిన నాలుగో బ్యాటర్‌గా యశస్వీ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు సౌరభ్ గంగూలీ(239), వినోద్ కాంబ్లీ(227), గౌతం గంభీర్(206)లు ఈ ఫీట్ సాధించారు. 22 ఏండ్ల వయసులోనే యశస్వీ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. చిన్నవయసులోనే డబుల్ సెంచరీ బాదిన మూడో భారత క్రికెటర్‌గా యశస్వీ రికార్డు సృష్టించాడు. వినోద్ కాంబ్లీ 21 ఏండ్ల 35 రోజుల వయసులో ద్విశతకం కొట్టాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ కొట్టాడు. అప్పటికీ అతడి వయసు 21 ఏండ్ల 283 రోజులు.