TEAM INDIA: భారత్‌దే ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ
జపాన్‌ను 4-0తో చిత్తు చేసిన మహిళల జట్టు.... రెండోసారి ట్రోఫీ కైవసం;
మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ఏకపక్ష విజయంతో జపాన్‌ను చిత్తు చేసింది. ఏకంగా 4-0 గోల్స్‌తో జపాన్‌ను మట్టికరిపించి భారత్ మహిళల జట్టు ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జపాన్ భారత మహిళలకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా భారత్-జపాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కొనసాగించింది. జపాన్‌ను 4-0తో ఓడించి రెండోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సంగీత కుమారి (17వ నిమిషం), నేహా (46వ నిమిషం), లారెమ్‌సియామి (57వ), వందనా కటారియా (60వ) గోల్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు.
భారత్-జపాన్ జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగుతుందని భావించారు. కానీ భారత మహిళల దూకుడు ముందు మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. తొలి భాగంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగినా తర్వాత మాత్రం భారత్ జోరు కొనసాగింది. జపాన్ కౌంటర్ అటాక్స్‌పై దృష్టి పెట్టడంతో భారత్‌కు ఆరంభంలోనే ఆధిక్యం సాధించే సువర్ణావకాశం లభించింది. అయితే జపాన్ గోల్‌కీపర్ అకియో తనకా ఆ గోల్‌ను సమర్థంగా అడ్డుకుంది. జపాన్‌ను పూర్తిగా ఆత్మ రక్షణలో పడేసిన భారత ఎటాకర్స్.. వారిని మ్యాచ్ మొత్తం ఒత్తిడిలోనే ఉంచారు. జపాన్ మహిళలకు కూడా అవకాశాలు లభించినా దృఢమైన భారత డిఫెన్స్‌ను వారి ఛేదించలేకపోయారు. రెండో క్వార్టర్ రెండో నిమిషంలో నేహా గోయల్ తొలి గోల్ అందించి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత జపాన్ గోల్ పోస్ట్‌పై భారత మహిళల జట్టు దాడుల తీవ్రతను మరింత పెంచింది.
రెండో క్వార్టర్‌లో జపాన్ స్ట్రైకర్ షిహో కొబయకావా గోల్ చేసినా అది బాడీని తగలడంతో ఆ గోల్‌ను రిఫరీ నిరాకరించారు. రెండో క్వార్టర్‌లో జపాన్ భారత గోల్ పోస్ట్‌పై చాలాసార్లు దాడులు చేసినా భారత డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. జపాన్‌కు మూడు వరుస పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదంటే భారత డిఫెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగో క్వార్టర్‌లోభారత్ మహిళలు అద్భుతంగా ఆడారు. నాలుగో క్వార్టర్ ప్రారంభంకాగనే భారత్ వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లను దక్కించుకుంది. నేహా దీప్ గోల్ చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. 57వ నిమిషంలో లాల్‌రెమ్సియామి మరో పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలిచింది. దీంతో ఆధిక్యం మూడుకు పెరిగింది. చివర్లో వందన కూడా గోల్ చేయడంతో 4-0తో భారత మహిళల జట్టు ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.