KHAWAZA: క్రికెట్‌కు ఖవాజా గుడ్ బై
కన్నీటితో వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే సిడ్నీ టెస్ట్ తనకు చివరి మ్యాచ్ అని తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టులో ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ వివక్షను తాను భరించలేకపోతున్నానని, ఇక ఆడలేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్)తో జరగబోయే ఐదో యాషెస్ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన 39 ఏళ్ల ఖవాజా, భావోద్వేగపూరితమైన ప్రసంగంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే, ఉస్మాన్ ఖవాజా తన టెస్ట్ కెరీర్‌ను 2011లో సిడ్నీ వేదికగానే ఇంగ్లాండ్‌పై ప్రారంభించారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే మైదానంలో, మళ్లీ అదే జట్టుతో ఆడి ఆటకు స్వస్తి పలకడం ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. పాకిస్థాన్‌లో జన్మించి, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడిన మొదటి ముస్లిం క్రికెటర్‌గా ఖవాజా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 87 టెస్టులు ఆడిన ఆయన 43.39 సగటుతో 6,206 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ స్థాయిలో 8,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. 2023లో ఐసీసీ ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకోవడం ఉస్మాన్ ఖవాజా కెరీర్‌లో అత్యున్నత ఘట్టం.
మరీ ఇంత వివక్షా..
" జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే వారికి సానుభూతి దక్కేది. అయ్యో పాపం జోష్, నాథన్ లయన్ అనేవారు. కానీ నేను గాయపడితే మాత్రం భిన్నంగా వ్యవహరించేవారు. నాదే తప్పన్నట్లుగా చూసేవారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ముందు రోజు రాత్రి తప్ప తాగి గాయపడినా వారిని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ నా విషయంలో మాత్రం వేరుగా వ్యవహరించేవారు. ఈ విషయంలోనే నేను ఎక్కువగా బాధపడ్డాను." అని ఖవాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.