KOHLI: కొత్త ఏడాది కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు!
2026లో కోహ్లీ ఎదుట 5 రికార్డులు... ఐపీఎల్ లో 9 వేల పరుగుల రికార్డు...ఊరిస్తున్న 300 సిక్సర్ల రికార్డు
భారత క్రికెట్ అభిమానులకు కొత్త ఏడాది ఆరంభమే ఉత్సాహాన్ని నింపేలా ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్‌తో చరిత్ర సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మరియు ఐపీఎల్‌పైనే పూర్తిగా దృష్టి సారించాడు. తనకు అత్యంత అచ్చొచ్చిన వన్డేల్లో మళ్లీ పాత కోహ్లీని గుర్తు చేసే ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. 2025 ఏడాది చివర్లో అద్భుత ఫామ్‌లోకి వచ్చిన అతడు, అదే జోరును 2026లో కొనసాగిస్తే ఐదు అరుదైన రికార్డులు అతడి పేరు మీద నిలిచే అవకాశముంది.
ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 సీజన్లో విరాట్ కోహ్లీ 9 వేల పరుగుల మైలురాయి అందుకోనున్నాడు. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌ల్లో 8661 పరుగులతో ఉన్నాడు. మరో 339 పరుగులు చేస్తే ఈ రికార్డ్ కోహ్లీ వశం కానుంది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు. అంతేకాకుండా ఒక్క ఫ్రాంచైజీ తరఫునే ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. గత మూడు సీజన్లలో 600 ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ.. ఈ రికార్డ్ నమోదు చేయడం పెద్ద కష్టమేం కాదు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7046 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో 300 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి కోహ్లీ కేవలం 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 9 సిక్సర్లు బాదితే.. కోహ్లీ పేరిట ఈ రికార్డ్ నమోదు కానుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. ఈ జాబితాలో గేల్(357), రోహిత్ (302) కోహ్లీ కంటే ముందున్నాడు.
42 రన్స్ కొడితే..
న్యూజిలాండ్, టీమ్ఇండియాల మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ రికార్డ్ సృష్టించే అవకాశముంది. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే.. ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను (28,016 పరుగులు) అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డ్ సృష్టిస్తాడు. అంతర్జాతీయ వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయికి విరాట్ కోహ్లీ 443 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 296 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేశాడు. మరో 443 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలు రాయి అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతడు 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటివరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15,000కు పైగా పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 150 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ రికార్డ్ అందుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 145 అర్థ శతకాలతో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 164 అగ్రస్థానంలో ఉన్నాడు.