టీమిండియా స్టార్ సిన్నర్ కుల్దీప్ యాదవ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నెలాఖరులో ఈ మిస్టరీ స్పిన్నర్ వివాహం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న కుల్దీప్.. ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం కుల్దీప్ యాదవ్ తనను భారత జట్టులో నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో వారం పాటు సెలవులు కావాలని రిక్వెస్ట్ చేసాడట.
నవంబర్ చివరి వారంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండో టెస్టుతో పాటు ఒక వన్డే ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ లకు కుల్దీప్ దూరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 22 నుంచి గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. నవంబర్ 30న రాంచీలో తొలి వన్డే ప్రారంభమవుతుంది. కుల్దీప్ రిక్వెస్ట్ పై జట్టు యాజమాన్యం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అతని సేవలు జట్టుకు ఎప్పుడు, అవసరమో ఆలోచించి సెలవులు మంజూరు చేయబడతాయనే టాక్ ఉంది. "కుల్దీప్ వివాహం నవంబర్ చివరిలో జరగనుంది.". అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా సౌథీ
ఐపీఎల్ సీజన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ సిబ్బందిలో ఖాళీగా ఉన్న స్థానాలను నెమ్మదిగా భర్తీ చేస్తోంది. జట్టుకు కొత్త ప్రధాన కోచ్ గా అభిషేక్ నాయర్ నియమించిన కేకేఆర్.. వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ప్రకటించింది. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీని కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నారు. శుక్రవారం కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ సౌథీని కొత్త బౌలింగ్ కోచ్‌గా ధృవీకరించారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్థానంలో సౌథీ కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. కోచింగ్ హోదాలో టిమ్ సౌతీని కేకేఆర్ ఫ్యామిలీలోకి తిరిగి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. "టిమ్ అపారమైన అనుభవం, సాంకేతిక నైపుణ్యం మా బౌలింగ్ యూనిట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అతని నాయకత్వ లక్షణాలు, ప్రశాంతమైన విధానం అతన్ని మా యువ బౌలర్లకు ఆదర్శవంతమైన గురువుగా చేస్తాయి". అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ చెప్పుకొచ్చారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌథీ ఇంగ్లాండ్ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఈ కివీస్ మాజీ పేసర్ కు ఇదే తొలిసారి.