బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. అగస్ట్ 21న తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే రెండో టెస్టుకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాళీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పీసీబీపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ పరువుపోతుందన్నాడు. ‘కరాచీలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని పీసీబీకి ముందే తెలుసు. అలాంటప్పుడు అక్కడ మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌లో టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగడం మన దేశానికి అవమానకరం. మనకు కేవలం రెండు, మూడు స్టేడియాలు మాత్రమే లేవు. ఫైసలాబాద్ సహా ముల్తాన్లో కూడా స్టేడియం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక స్టేడియంలో సెకెండ్ టెస్టును నిర్వహించాల్సింది. పీసీబీది సరైన నిర్ణయం కాదు. ఇది నిజంగా మనకు సిగ్గు చేటు‘ అక్మల్ మండిపడ్డాడు.