IPL: అభిమానుల "బెంగ" తీరేలా ఆర్సీబీ ఆట
ప్రత్యర్థి జట్లకు బెంగళూరు ఛాలెంజ్... అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న అర్సీబీ;
ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్ లో బెంగళూరు జట్టు.. మొత్తానికి ప్లేఆఫ్ కు చేరువలోకి వచ్చేసింది. ఇక మిగిలి ఉన్న మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచినా బెంగళూరు ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఇప్పటికే 14 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏడు విజయాలను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇక ప్లేఆఫ్ లో చోటు సంపాదించుకునేందుకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మిగిలిన జట్ల కంటే పాయింట్లలోనూ, రన్ రేట్ లోనూ బెంగళూరు మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సొంత గడ్డ బెంగళూరుపై తమను ఓడించారని కసితో రగిలిపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఢిల్లీలోనే ఢిల్లీ కాపిటల్స్ జట్టును మట్టికరిపించి ఘనంగా రివెంజ్ తీర్చుకుంది. ఈ దశలో పాయింట్ల పట్టికను చూస్తే.. నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అత్యధిక వికెట్ల వీరుడు సైతం బెంగళూరుకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ కావడం విశేషం. చాలా ఏళ్ల తర్వాత లీగ్‌లో తమ జట్టు ఆధిపత్యం చలాయిస్తుండడంతో ఆర్సీబీ అభిమానుల్లో తొలి టైటిల్ మీద ఆశలు రేగుతున్నాయి.
అన్నీ మారాయ్
ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్‌కి ఎన్నో జ్ఞాపకాలను అందిస్తోంది. ప్రతి ఏడాదీ బౌలింగ్‌లో విఫలమయ్యే ఆర్సీబీ ఇప్పుడు డెత్ ఓవర్లలో కూడా బ్యాటర్లకు చుక్కలు చూపెడుతోంది. బ్యాటింగ్ విభాగంలోనూ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం తర్వాత పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో విరాట్ కోహ్లి, పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో హేజెల్‌వుడ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ‘‘ఈసాలా కప్ నమ్‌దే’’.. ఐపీఎల్ ఆరంభం కాబోతుండగా ఆర్సీబీ అభిమానుల నుంచి గట్టిగా వినిపించే నినాదం ఇది. స్వయంగా విరాట్ కోహ్లి సైతం గతంలో ఈ మాట చెప్పిన సందర్భాలున్నాయి. కానీ ఎంతకీ ఆర్సీబీ ఆశ తీరకపోవడంతో ఈ మాట ఒక జోక్‌గా మారిపోయింది. కొన్నేళ్లుగా కప్పు కొట్టడం సంగతి అటుంచితే ప్లేఆఫ్స్ చేరడానికే ఆర్సీబీ నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. నిరుడు ఆఖర్లో అన్నీ కలిసొచ్చి ప్లేఆఫ్స్ అయితే చేరింది కానీ.. అక్కడ ఎలిమినేటర్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ మీద అసలు అంచనాలే లేవు. అసలు అంచనాలే లేని స్థాయి నుంచి బెంగళూరు ఇప్పుడు ప్లే ఆఫ్ కు దాదాపుగా చేరుకునే బలమైన స్థితికి చేరుకుంది.