Rishabh Pant: పునరాగమనం కోసం చెమటోడుస్తున్న పంత్
ఫిట్‌నెస్ సాధించేందుకు కఠిన ఎక్సైజ్‌లు చేస్తున్న స్టార్ బ్యాటర్... త్వరలోనే కమ్ బ్యాక్ అంటూ అభిమానుల సంబరాలు;
టీమిండియాలో పునరాగమనం చేసేందుకు భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించడం కోసం, తిరిగి జట్టులోకి రావడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్న పంత్ ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టమైన వ్యాయామాలు చేస్తున్నాడు. ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోలను ఈ డాషింగ్ బ్యాటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ దేవుడికి కృతజ్ఞతలు. చిమ్మచీకటి ఉండే టన్నెల్‌లో వెలుగును చూడగలుగుతున్నా అని పంత్ ఆ వీడియోతోపాటు భావోద్వేగ పోస్ట్ చేశాడు.
దాదాపు 8 నెలలుగా ఆటకు దూరమైన పంత్.. మోకాలి శస్త్రచికిత్స(surgery) అనంతరం సొంతంగా బరువులు ఎత్తడం, స్టిక్ అవసరం లేకుండా నడవడం చేస్తున్నాడు. తాజాగా ఈ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి కమ్ బ్యాక్ కోసం తాను ఎంత శ్రమిస్తున్నానో అభిమానులకు చెప్పాడు. అనూహ్య రీతిలో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా పంత్ కోలుకుంటున్నాడు. తన కోసం తయారు చేసిన ప్రత్యేక ఫిట్‌నెస్ సెషన్‌లలో పాల్గొంటూ రోజు రోజుకు మెరుగవుతున్నాడు.
ధనాధన్ బ్యాటింగ్ చేసే పంత్ గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ టైంకి పంత్ ఫిట్‌గా ఉంటాడనే టాక్ వినిపిస్తుంది. పంత్(Rishabh Pant) వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయాని కంటే ముందే టీమిండియా(team india)లో జాయిన్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 2024 ఐపీఎల్‌లో పంత్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో సత్తాచాటితే వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పంత్.. బరిలోకి దిగే అవకాశం ఉంది.
రోడ్డు ప్రమాదం(road accident)లో గాయపడిన తర్వాత రిషబ్ పంత్ ఇటీవల భారత జట్టు(indian team) శిబిరానికి వచ్చి సహచరులను కలిశాడు. ఆసియాకప్(asia cup) కోసం సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లతో అతడు మాట్లాడాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్(rahul dravid)తోనూ ముచ్చటించాడు. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ బ్యాటింగ్ చేశాడు. ప్రమాదం తర్వాత తొలిసారి బ్యాట్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.