RO-KO: ఆస్ట్రేలియా అభిమానులకు రో-కో వీడ్కోలు
మళ్లీ ఆడాతామో లేదో అన్న రోహిత్ శర్మ.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ ప్రసంగం...రో-కోను చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్
తాను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడుతామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించామని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్థశతకంతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది.
రోహిత్ భావోద్వేగ ప్రసంగం
‘ఆస్ట్రేలియాకు రావడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ ఆడటం అద్భుతంగా ఉంటుంది. 2008లో ఇదే సిడ్నీ మైదానంలో హాఫ్ సెంచరీ చేశా. అప్పుడు మ్యాచ్‌ను కూడా గెలిపించా. దానిని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాను. సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఈరోజు కూడా ఎంజాయ్ చేశా. మొదటి వికెట్ పడ్డాక విరాట్ వచ్చాడు. వికెట్ ఇవ్వకుండా రన్స్ చేయాలనుకున్నాం. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు. ‘నేను, విరాట్ కోహ్లీ మరలా ఆస్ట్రేలియాకు వస్తామో లేదో నాకు తెలియదు. ఇన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఆడటం సరదాగా ఉంది. ఆస్ట్రేలియాలో నాకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అలానే చెడు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆసీస్ గడ్డపై క్రికెట్ ఆడటాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించా. మమ్మల్ని ఆదరించిన ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తామిద్దరం ఆస్ట్రేలియాకు రామని రోహిత్ హింట్ ఇచ్చాడని అంటున్నారు.
బ్యాటింగ్ అంత ఈజీ కాదు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆస్ట్రేలియా కండిషన్స్ ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఇక్కడ రాణించడం అంత సులువు కాదు. నేను సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడలేదు. కానీ ఈ పర్యటన కోసం బాగా సిద్దమయ్యాను. మేం ఈ సిరీస్ గెలవలేకపోయాం. కానీ మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
నెహ్రా ఏం అన్నాడంటే?
రోహిత్, కోహ్లీ వయసు వారి భవిష్యత్తును నిర్ణయించే ప్రమాణం కాకూడదన్నాడు నెహ్రా. రోహిత్ వయసు 36, కోహ్లీ 35. ఈ ఇద్దరు యువకులు కానప్పటికీ.. టీ20లో ఆడడానికి, వయసుకు లింక్ పెట్టకూడదన్నాడు నెహ్రా. 'వయస్సు అనేది ప్రమాణం కాదు. మీరు ఎన్ని పరుగులు చేస్తున్నారన్నది ముఖ్యం. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ , శుభమాన్ గిల్ గురించి మాట్లాడాం ... కానీ రోహిత్ శర్మ ఆడాలనుకుంటే, వారంతా అతనితో పోటీ పడాలి. అతను 36- ఏళ్ళ వయసున్న సూపర్ యువకుడు. మనం విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి' అని కామెంట్ చేశాడు.