Rohit Sharma Retirement: రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం..

టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌!;

Update: 2024-06-30 01:45 GMT

టీమిండియా కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ మ్యాచ్ అనంతరం రోహిత్‌ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్‌ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది.


టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ మ్యాచ్ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ‘టీ20 క్రికెట్‌లో ఇదే నా చివరి మ్యాచ్‌. వీడ్కోలు పలకడానికి ఇంతకుమించి మంచి సందర్భం, సమయం లేదు. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాను. పొట్టి ఫార్మాట్‌తోనే భారత్ తరఫున నా కెరీర్ మొదలైంది. ఈసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కచ్చితంగా గెలవాలనుకున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదు. ఈ సందర్భం కోసం నా జీవితంలో ఎంతో ఎదురుచూశాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఎట్టకేలకు నా కల నెరవేరింది’ అని చెప్పాడు.

2007 టీ20 ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. 159 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 4,231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 32 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రోహిత్‌ సారథ్యంలోనే భారత జట్టు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. టీ20లలో హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు.

Tags:    

Similar News