ROHIT: ఆ క్షణం..గుండె ఆగిపోయినంత పనైంది
ప్రపంచకప్ గెలిచిన క్షణాలు పంచుకున్న రోహిత్.... టీ 20 ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు వెల్లడి;
2024లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ను గెలిచి టీమిండియా జగజ్జేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయం సాధించి పొట్టి ప్రపంచకప్పును ముద్దాడింది. చివరి ఓవర్ వరకూ నరాలు తెగేంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్... క్రికెట్ ప్రేమికుల మనస్సులపై చెరగని ముద్రే వేసింది. ఓ దశలో తేలిగ్గా గెలుస్తుందనుకున్న ప్రొటీస్.. ఒత్తిడికి చిత్తవ్వడం... రోహిత్ శర్మ టీ 20 ప్రపంచకప్పును అందుకోవడం భారత క్రికెట్ అభిమానులకు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి. అయితే ఫైనల్ జరుగుతున్నప్పుడు టీమిండియా సారధి పరిస్థితి ఎలా ఉంది. అసలు గెలుస్తామని అనుకున్నారా..? అనే ప్రశ్నలు అప్పుడు క్రికెట్ అభిమానులను వెంటాడాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలపై రోహిత్ శర్మ స్పందించారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ నాటి పరిస్థితిని గుర్తు తెచ్చుకున్నాడు. బార్బడోస్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ కైవసం చేసుకుంది.
తీవ్ర ఒత్తిడికి గురయ్యా
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని తెలిపాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ పోతుందని భావించానని... కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘ఫైనల్లో చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పుడే మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. అయితే నేను ఆ బంతి సిక్స్ అనుకున్నా. సూర్య పట్టిన క్యాచ్ సరైనదో లేదో తేల్చడానికి థర్డ్ అంపైర్‌కి ఫీల్డ్ అంపైర్లు పంపారు. ఆ సమయంలో టీమ్ మొత్తం తీవ్ర ఒత్తిడికి గురైంది. సూర్యా అది క్యాచేనా అని నేను అడిగా?. బంతిని బాగా పట్టానని సూర్య చెప్పాడు.రీప్లేలో సూర్య అద్భుతంగా బంతిని అందుకున్నాడని కనిపించింది. అందరం సంతోషంలో మునిగిపోయాం. నిజానికి ఆ క్యాచ్ సూర్య పట్టకుంటే కచ్చితంగా సిక్స్ వెళ్లేదే.’ అని రోహిత్ తెలిపాడు.
పంత్‌ది ఫేక్ ఇంజూరీ
'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పంత్ చాకచక్యం గురించి రోహిత్ ప్రశంసించాడు. "దక్షిణాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. అప్పుడు చిన్న విరామం వచ్చింది. పంత్ తన తెలివితేటలను ఉపయోగించి ఆటను ఆపాడు. అతనికి మోకాలి గాయం ఉంది, అతని మోకాలికి టేప్ వేశారు. ఇది ఆటను నెమ్మదిస్తుంది. ఆట వేగంగా సాగుతోన్న సమయంలో రిథమ్ బ్రేక్ చేయాలి. నేను ఫీల్డ్ సెట్ చేసుకుంటూ బౌలర్లతో మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా పంత్ నేలమీద పడి ఉన్నాడు. ఫిజియో వచ్చి అతని మోకాలికి టేప్ వేస్తున్నాడు. పంత్ తన తెలివితేటలను ఉపయోగించాడు. అన్ని విషయాలు మనకు అనుకూలంగా జరిగాయి’’ అని రోహిత్ తెలిపాడు.