భారత క్రికెట్ జట్టు 2023 వరల్డ్ కప్‌ని గెలిచి స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలన్నాడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్. నవంబర్ 19న ఫైనల్ గెలిచి విరాట్ కోహ్లీ వరల్డ్‌కప్ ఎత్తుకోవడం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుందన్నాడు. 2011 లో ధోనీ సారథ్యంలో కప్ గెలిచి సచిన్‌కి బహుమతిగా ఇచ్చిన సంగతిని గుర్తుకు చేశాడు.
మంగళవారం ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభమవనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. భారత్, పాక్‌లు అక్టోబర్ 15న తలపడనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ డాషింగ్ ఓపెనర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లోనూ తన సామర్థ్యానికి మించి ఆడటానికి ప్రయత్నిస్తాడన్నాడు. మేం మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కి వరల్డ్‌కప్ అందించాలని ఆడామన్నాడు. ఇప్పుడు కోహ్లీకి కూడా అదే విధంగా బహుమతివ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"మేం సచిన్ కోసమే వరల్డ్ కప్ బాగా ఆడాము. వరల్డ్ కప్ గెలిచి సచిన్‌కి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకున్నాము. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా అంతే. వరల్డ్‌కప్‌ని చాలా మంది తనకోసమే చూస్తారు. తన జట్టు కోసం తన 100 శాతం ప్రదర్శన ఎల్లపుడూ ఇస్తాడు" అని వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్‌కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండన్నాడు. విరాట్‌కోహ్లీకి పిచ్‌లపై బాగా అవగాహన ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో చాలా పరుగులు చేసి జట్టుకు కప్ అందించడానికి సహాయపడతాడని తెలిపాడు.
Sachin Tendulkar-2011 WorldCup
2011 సంవత్సరంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ అందించాడు. 2007 వరల్డ్‌కప్ ఘోరపరాభవం అనంతరం ఎంతో ఒత్తిడిలో టోర్నీకి వెళ్లిన భారత్ స్వదేశంలో కప్‌ని ఒడిసిపట్టింది. ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ట్రోఫీ గెలిచిన అనంతరం సచిన్ టెండూల్కర్‌ని భుజాలపై మోస్తూ, స్టేడియం అంతా తిరుగుతూ జీవితంలో మరచిపోలేని విధంగా వరల్డ్‌కప్‌తో వీడ్కోలు పలికారు.