SHREYAS IYER: పంజాబ్ కింగ్... శ్రేయస్ అయ్యర్
11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేర్చిన పంజాబ్ కింగ్ శ్రేయస్ అయ్యర్;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చాలా మంది కెప్టెన్లు వచ్చి వెళ్లారు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి వారు తమ విజయాలతో ఐపీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఐపీఎల్ లో అత్యధికసార్లు టైటిల్ ను గెలిచి విజయవంతమైన సారధులుగా చరిత్రనూ సృష్టించారు. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఉన్న కెప్టెన్లతో పోలిస్తే శ్రేయస్ అయ్యర్ మాత్రం విభిన్నమైన కెప్టెన్. అతను అదృష్టాన్ని మార్చే కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ జట్లు అతన్ని నమ్మి బాధ్యతలు అప్పగించాయో... వాటి ఆశలను.. అంచనాలను అయ్యర్ ఇప్పటివరకూ వమ్ము చేయలేదు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో ఆయా జట్లకు అడ్డంకులను తొలగించి వరుస విజయాలు అందించాడు. ఇప్పుడు పంజాబ్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేశాడు. అసలు అంచనాలే లేని జట్టును.. నిలకడలేమికి మారు పేరుగా ఉండే టీంను ప్లే ఆఫ్స్ కు చేర్చి శ్రేయస్ అద్భుతమే చేశాడు. పంజాబ్ జట్టు అద్భుత ప్రదర్శనతో 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది. అందుకు కారణం ఒకే ఒక్కడు.. అతడే శ్రేయస్ అయ్యర్. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది.
రూపురేఖలు మార్చేశాడు
పంజాబ్ జట్టులో కెప్టెన్లు తరచూ మారుతుంటారు. అలాంటి సమయంలో శ్రేయస్ జట్టులోకి వచ్చాడు. కానీ అందరి కెప్టెన్లలా కాకుండా తన మార్క్ చూపెట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు రూపురేఖలనే మార్చివేశాడు. అటు బ్యాట్‌తో, ఇటు కెప్టెన్సీతో ఆకట్టుకుంటూ.. తన జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలను నమోదు చేసిన పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మే 18న జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఇది ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్‌కు 8వ విజయం. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఇది చాలా పెద్ద విజయం, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ 2014 తర్వాత మళ్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎన్నుకుంది. 11 సంవత్సరాల తర్వాత తమ అదృష్టం మారడాన్ని చూసింది.
17 ఏళ్లలో రెండోసారే
ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు 17 ఏళ్లలో పంజాబ్ రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్ చేరింది. చివరగా 2014లో రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 11 ఏళ్ల తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్ చేరింది. ఐపీఎల్ లో కెప్టెన్ గా శ్రేయస్ కు ఘనమైన రికార్డు ఉంది. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ చేర్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఏకైక ఫైనల్ అదే. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. కెప్టెన్ గా కేకేఆర్ ను అద్భుతంగా నడిపించాడు శ్రేయస్. ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయస్ ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్. ఆ రేటుకు న్యాయం చేస్తూ టీమ్ ను 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ కు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు టీమ్ లను ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. సారథి అంటే జట్టు విజయాల్లో తనవంతు పాత్ర కూడా ఉండాలి. ఈ విజయ సూత్రాన్ని నిరూపిస్తూ ముందుకుసాగుతున్నాడు శ్రేయస్. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అయ్యర్.. ఇప్పటివరకూ 435 పరుగులు చేశాడు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో శతకానికి(97*) చేరువగా వచ్చాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకామున్నా.. జట్టు కోసమే నిలబడ్డాడు.