SPIN PITCH: "స్పిన్" రూట్ మార్చిన టీమిండియా
స్పిన్ పిచ్ వద్దని చెప్పిన టీమిండియా.. కివీస్ సిరీస్‌లో బొక్కబోర్లా పడ్డ భారత్...సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత్ సిద్ధం
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. కోల్‌కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నదమవుతుంది. అయితే కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌కు ర్యాంక్ టర్నర్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
కివీస్ సిరీస్‌లో శరాఘాతం
సొంతగడ్డపై విపరీతంగా తిరిగే పిచ్‌లను ఇష్టపడే టీమ్ఇండియాకు నిరుడు న్యూజిలాండ్‌తో సిరీస్ శరాఘాతమే అయింది. తన స్పిన్ వలలో తానే చిక్కుకుని గిలగిల్లాడింది. స్వదేశంలో ఒక్క టెస్టు ఓడిపోవడమే ఎక్కువనుకుంటే.. ఆ సిరీస్‌లో ఏకంగా 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బందిపడగా.. అదే సమయంలో ఆ జట్టు బ్యాటర్లపై మన స్పిన్నర్ల మాయాజాలం పనిచేయలేదు. శాంట్నర్ (ఒక మ్యాచ్‌లో 13 వికెట్లు), అజాజ్ పటేల్ (3 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు)లు టీమ్ఇండియాను తమ స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ సిరీస్ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఇండియా ఫైనల్ అవకాశాలను దెబ్బతీసింది. ఆ నేపథ్యంలో పిచ్‌ల విషయంలో భారత్ ఆలోచన తీరు మారిపోయింది. ఇప్పుడు గిర్రున తిరిగే పిచ్‌లు కావాలని అడగకపోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సమతూకం ఉన్న పిచ్‌లను కోరుకుంటున్నాడు. స్వదేశంలో ఎప్పుడూ అధికంగా స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై ఆడితే జట్టు విదేశాల్లో ఇబ్బంది పడుతుందన్నది అతడి ఉద్దేశం. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను కూడా అలాంటి పిచ్‌లపై ఆడలేదు. ఆ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
పేసర్లకే ఈ"డెన్"
సాధారణంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరిస్తోంది. ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. స్పిన్ పిచ్‌లు సిద్దం చేసినా తమకే అడ్వాంటేజ్‌గా మారుతుందని సౌతాఫ్రికా భావిస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ పర్యటనలో ఆ జట్టు 1-1తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా స్పిన్నర్లు హర్మర్(13), ముత్తు సామి(11), కేశవ్ మహరాజ్(9)లు 33 వికెట్లు పడగొట్టారు. ఆ జట్టు స్పిన్ విభాగం బలంగా ఉంది. ఈ క్రమంలోనే సమతూకమైన పిచ్‌లను సిద్దం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఓ మోస్తరుగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేసే అవకాశముంది. టీమ్ఇండియా టర్నింగ్ పిచ్ కావాలని కోరలేదని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ చెప్పాడు. తొలి టెస్టు శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పిచ్‌పై అక్కడక్కడ కాస్త పచ్చిక ఉంది. మ్యాచ్ సమయానికి పెద్దగా మారకపోవచ్చు ‘‘స్పోర్టింగ్ పిచ్‌ను సిద్ధం చేశాం. బ్యాటర్లతోపాటు బౌలర్లకూ సహకారం లభిస్తుంది’’ అని ఈడెన్ క్యురేటర్ సుజన్ చెప్పాడు.