T20 WORLDCUP: మహా సంగ్రామంలో కివీస్‌దే ఆధిపత్యం
పొట్టి ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి... భారత్‌పై ఆడిన మూడుసార్లు గెలిచిన కివీస్... ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసి
టీ20 ప్రపంచకప్ 2026 తుది సమరానికి వేదిక సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ముందు ఇరు జట్లు వేర్వేరు పరిస్థితుల్లో ఫైనల్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ఇండియా కొంత తడబడుతూనే ఫైనల్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ మాత్రం స్థిరమైన ప్రదర్శనతో ఉత్సాహంగా తుది పోరుకు సిద్ధమైంది. దీంతో ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ టోర్నీలో భారత్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కొన్ని కీలక విభాగాల్లో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం భారత జట్టుకు పెద్ద సమస్యగా మారింది. అతను ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడంతో టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు స్పిన్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాల్సిన వరుణ్ చక్రవర్తి కూడా ఈ టోర్నీలో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాల్సిన సందర్భాల్లో అతని బౌలింగ్ తేలిపోవడం జట్టుకు ఆందోళన కలిగించింది. అదనంగా శివమ్ దూబె బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడం కూడా భారత బౌలింగ్ విభాగాన్ని కాస్త బలహీనపరిచింది.సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా ఈ సమస్యలు కొంతవరకు బయటపడ్డాయి. ఇంగ్లాండ్‌పై జరిగిన ఆ కీలక పోరులో భారత్ బ్యాటింగ్‌లో భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ, బౌలింగ్‌లో ఒత్తిడిని ఎదుర్కొంది. చివరికి కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది. ఆ మ్యాచ్ ఫలితం భారత శిబిరానికి ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, బౌలింగ్ విభాగంలో ఉన్న లోపాలు మాత్రం స్పష్టంగా బయటపడ్డాయి.
దీంతో ఫైనల్‌కు ముందు జట్టు మేనేజ్మెంట్ ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ జట్టు మాత్రం పూర్తి నమ్మకంతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై కివీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంగా ఆడిన కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ పోటీల్లో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమ్ఇండియా మొత్తం 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. ఈ గణాంకాలు చూస్తే టీ20ల్లో భారత్ కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.
భారత గడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లో కూడా టీమ్ఇండియానే ఎక్కువ విజయాలు సాధించింది. స్వదేశంలో భారత్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే సమయంలో కివీస్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ గడ్డపై కూడా భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. అక్కడ భారత్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్ జట్టు రెండు విజయాలు నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలలో మాత్రం కథ కొంచెం భిన్నంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్ మూడు సార్లు తలపడ్డాయి. ఆ మూడు సందర్భాల్లోనూ విజయం న్యూజిలాండ్‌కే దక్కింది. ఈ రికార్డు టీమ్ఇండియాకు కొంత ఒత్తిడిని కలిగించే అంశమే. ప్రపంచకప్‌ల్లో కివీస్‌పై భారత్‌కు విజయం దక్కలేదు.