T20 WORLD CUP: మహా సంగ్రామంలో విశ్వ విజేతలెవరో?
నేడే టీ 20 ప్రపంచకప్ ఫైనల్... ఆత్మ విశ్వాసంతో న్యూజిలాండ్... మంచి ఫామ్‌లో ఉన్న భారత్... కీలకంగా మారనున్న బుమ్రా
సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు.. అంచనాలకు తగ్గట్లే ఫైనల్‌కు చేరుకుంది. ఇది సంతోషాన్నిచ్చే విషయమే కానీ.. టోర్నీలో భారత్ ఇప్పటిదాకా సిసలైన ఛాంపియన్‌లా ఆడలేదన్నది వాస్తవం. అయితే ఛాంపియన్లాగే ఆడిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆట ఎలా సాగినా, గెలుపే ముఖ్యం. అలాగే ఫైనల్లోనూ భారత్ గెలిచి కప్పు పట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ గత మ్యాచ్‌ల అనుభవాలను బట్టి చూస్తే.. భారత్ ఆటతీరుతో పాటు వ్యూహాలు మార్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.గత రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. ఫైనల్ సమయం దగ్గరపడుతుండటంతో ఈ కివీ శాపం మళ్లీ తమ ప్రపంచకప్ ఆశలను చిదిమేస్తుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అభిమానులు పిలుచుకునే ఈ కివీ శాపం అంటే టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఐసీసీ వేదికపై మాత్రం కివీస్ భారత్‌కు అజేయమైన అడ్డంకిగా నిలుస్తోంది. అత్యంత కీలకమైన మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కివీస్ బౌలర్లు ఎంతవరకు అడ్డుకోగలరో చూడాలి.
మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ పైచేయి సాధించినప్పటికీ, ప్రపంచ కప్‌లో మాత్రం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ 3 సార్లు భారత్‌ను ఓడించింది, అయితే భారత్ ఇప్పటివరకు కివీస్‌పై ఒక్క విజయం కూడా సాధించలేదు. ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్ ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మూడు రకాల పిచ్‌లు ఉన్నాయి.
. రెండు వారాల కిందట బ్లాక్ సాయిల్ ట్రాక్‌పై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అందుకే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ రెడ్ సాయిల్ పిచ్‌ను కోరుకునే అవకాశం ఉందని సమాచారం. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా పూర్తిగా రెడ్ సాయిల్ పిచ్లే ఉంటాయి. అక్కడ సెమీఫైనల్లో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో అదే తరహా ట్రాక్‌పై ఫైనల్ జరగాలని టీమ్ మేనేజ్మెంట్ భావించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఫైనల్ పిచ్ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రసార సంస్థలు ఇంకా స్టంప్ కెమెరాను ఏ పిచ్‌పై ఏర్పాటు చేయాలో నిర్ణయించలేదు. మొత్తానికి అహ్మదాబాద్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ పెద్ద ప్లానే చేస్తోంది.
భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న విషయం బౌలింగే. జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే నమ్మదగ్గ బౌలరే కనిపించడం లేదు. సెమీఫైనల్లో మరో ప్రత్యామ్నాయం కనిపించక.. భారత్ ఎంతో ఇబ్బంది పడింది. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా కష్టమే అనిపించింది. బుమ్రా కాకుండా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తేలిపోయారు. పేసర్లు అర్ష్‌దీప్, హార్దిక్ సైతం అంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేదు. వీళ్లిద్దరి కోటా అయిపోవడంతో.. అక్షర్‌తో చివరి ఓవర్ వేయించలేక పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబెకు బంతి అప్పగించాడు కెప్టెన్. అతను తొలి మూడు బంతులు కట్టుదిట్టంగా వేయడంతో భారత్ బయటపడింది కానీ తర్వాతి మూడు బంతులకు అతను సిక్సర్లు ఇచ్చేశాడు. ఆ షాట్లు తొలి మూడు బంతుల్లో పడి ఉంటే కథ వేరుగా ఉండేదే. దూబెను బౌలింగ్‌కు దించాల్సి రావడమే జట్టు దుస్థితికి నిదర్శనం.