T20 worldcup: భారత జట్టుకు అచ్చిరాని నరేంద్ర మోదీ పిచ్
ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ
టీమిండియా ఇప్పటికే రెండు టీ20 వరల్డ్ కప్స్ గెలుచుకుంది... ఇప్పుడు ఇంకో ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచింది. అయితే గత వరల్డ్ కప్స్ కంటే ఇది చాలా ప్రత్యేకమైనది... ఎందుకంటే స్వదేశంలో, సొంత ప్రేక్షకుల మధ్య ట్రోఫీని అందుకోవడం కంటే గొప్పదనం ఇంకేముంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నేడు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తుచేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా... ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుండటం టీమిండియా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఈ స్టేడియం భారత జట్టుకు పెద్దగా అచ్చిరాలేదు. ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఇదే స్టేడియంలో జరిగింది.. టోర్నీ మొత్తం ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరింది భారత జట్టు... కానీ ఈ మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఓడింది. దీంతో మరో వన్డే వరల్డ్ కప్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది... అదీ ఈ అహ్మదాబాద్ స్టేడియంలోనే. గ్రూప్-8 స్టేజ్ లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియాకు సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మారాయి... ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండిస్ ను ఓడించి సెమీస్ కు చేరింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఓటముల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఉటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సెంటిమెంట్ ను భారత జట్టు మారుస్తుందా.. లేక కొనసాగిస్తుందా? అన్నది నేడు . మరి ఈ మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది..? ఎవరికి సహకరిస్తుందనేది చూడాలి.
భారత గడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియానే ఎక్కువ విజయాలు సాధించింది. స్వదేశంలో భారత్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. అదే సమయంలో కివీస్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ గడ్డపై కూడా భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. అక్కడ భారత్ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్ జట్టు రెండు విజయాలు నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలలో మాత్రం కథ కొంచెం భిన్నంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్ మూడు సార్లు తలపడ్డాయి. ఆ మూడు సందర్భాల్లోనూ విజయం న్యూజిలాండ్‌కే దక్కింది. ఈ రికార్డు టీమ్ఇండియాకు కొంత ఒత్తిడిని కలిగించే అంశమే. ప్రపంచకప్‌ల్లో కివీస్‌పై భారత్‌కు విజయం దక్కలేదు.