T20WORLD CUP: పసికూనను కసిగా కొట్టేశారు
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు... చెలరేగిన అభిషేక్, పాండ్యా, తిలక్ వర్మ
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో కీలక సమయంలో టీమ్‌ఇండియా చివరికి తన అసలు శక్తిని చూపించింది. ఫామ్‌పై ఆందోళనలు, బౌలింగ్‌పై విమర్శలు, సెమీఫైనల్ అవకాశాలపై సందేహాలు అన్నీ మ్యాచ్‌లో కొట్టిపారేసిన ప్రదర్శన ఇది. బ్యాటర్లు సమష్టిగా చెలరేగిన వేళ, భారీ స్కోరు కట్టి, ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను కట్టుదిట్టంగా ముగించిన భారత్… జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్ రేసులో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ స్థాయి ప్రదర్శన రావడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. మరోవైపు వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలవడం భారత్‌పై ఒత్తిడిని కొంత తగ్గించింది. అయితే బౌలింగ్‌లో ఇంకా మెరుగుదల అవసరమనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి.
చెన్నై వేదికగా జరిగిన ఈ సూపర్-8 పోరులో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై రన్స్ వస్తాయన్న అంచనాలు నిజమయ్యాయి. భారత్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. సంజూ శాంసన్ (24) రెండో బంతినే సిక్స్‌గా మలిచి తమ ఉద్దేశాన్ని స్పష్టంచేశాడు. అతనికి జతగా అభిషేక్ శర్మ (55) సాహసోపేతమైన షాట్లతో చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ భారత్‌కు బలమైన బేస్ ఇచ్చింది. అభిషేక్ శర్మకు ఇది ఎంతో కీలక ఇన్నింగ్స్. గత మ్యాచ్‌ల్లో ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొన్న అతడు ఈసారి ధనాధన్ బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. మపోసా, ముజరబాని బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాదుతూ పవర్‌ప్లేలోనే జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రజా బౌలింగ్‌లో సింగిల్ తీసి కేవలం 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది.
అభిషేక్ ఔటయ్యాక కూడా భారత్ వేగం తగ్గలేదు. ఇషాన్ కిషన్ (38) తన సహజ దూకుడుతో బౌండరీలు బాదాడు. అతడితో కలిసి అభిషేక్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (33) క్రీజులోకి వచ్చి తొలి బంతినే స్వీప్‌తో బౌండరీకి తరలించి తన స్టైల్ చూపించాడు. కేవలం 13 బంతుల్లో 33 పరుగులు చేసి మ్యాచ్‌ను మరింత భారత్ వైపు మలిచాడు. 15వ ఓవర్లో భారత్ స్కోరు 172 వద్ద ఉండగా, అక్కడి నుంచి అసలు విధ్వంసం మొదలైంది. హార్దిక్ పాండ్యా (50 నాటౌట్) మరియు తిలక్ వర్మ (44 నాటౌట్) జంట జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చిచెండాడింది. చివరి 5 ఓవర్లలో ఏకంగా 80 పరుగులు రాబట్టడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. 31 బంతుల్లో 84 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఐదో వికెట్‌కు జోడించిన ఈ జంట భారత స్కోరును 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్థాయికి తీసుకెళ్లింది. చివరి రెండు బంతులను హార్దిక్ సిక్స్‌లుగా మలచడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ ఇన్నింగ్స్‌కు హార్దిక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆరంభం బాగానే చేసింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. కానీ లక్ష్యం పెద్దదిగా ఉండటంతో అవసరమైన రన్‌రేట్ క్రమంగా పెరిగింది. ఏడో ఓవర్లో మరుమాని (20)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. అయితే మరో ఓపెనర్ బెనెట్ అద్భుత పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ విభాగం తన పూర్తి సామర్థ్యాన్ని చూపించింది. టాప్ ఆర్డర్ నుంచి ఫినిషర్ల వరకూ అందరూ కలిసి చెలరేగిన ఈ ఇన్నింగ్స్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.