T20 WPRLD CUP: నేడే టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్
టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఇలా గెలవాలంతే
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత జట్టు పరిస్థితి ఇప్పుడు అత్యంత కీలక మలుపులో నిలిచింది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఎదురైన భారీ ఓటమి తర్వాత సెమీఫైనల్ అవకాశాలు గణనీయంగా సంక్లిష్టమయ్యాయి. ఇకపై సాధారణ విజయాలు సరిపోవు. భారీ తేడాతో గెలవడం తప్ప టీమిండియాకు మరో మార్గం లేదు. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ సమీకరణాలు భారత భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకున్నాయి. మ్యాచ్ ఫలితంతో పాటు గెలుపు తేడా కూడా సమానంగా కీలకం కావడంతో, జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ నిజమైన అర్ధంలో ‘డూ ఆర్ డై’ సమరంగా మారింది. సూపర్-8లో భారత్ ఇంకా జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం తప్పనిసరి. రెండు విజయాలు సాధిస్తే భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరతాయి. అయితే పాయింట్లు మాత్రమే సరిపోవు. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ -3.800గా ఉంది. అదే గ్రూప్‌లో ఉన్న వెస్టిండీస్ రన్‌రేట్ 5.350గా ఉండగా, దక్షిణాఫ్రికా 3.800తో ముందంజలో ఉంది. ఈ గణాంకాలు భారత స్థితిని ఎంత క్లిష్టంగా మార్చాయో స్పష్టం చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కోసం వినియోగించబోయే పిచ్‌ను ఇప్పటివరకు దేశవాళీ మ్యాచ్‌లకు ఉపయోగించలేదని తెలుస్తోంది. అది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని, బంతి బ్యాట్‌పై చక్కగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం భారత అభిమానుల్లో కొంత ఆశను నింపుతోంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంటే, అదే భారత్‌కు నెట్ రన్‌రేట్ మెరుగుపరచుకునే అవకాశం కూడా అవుతుంది.
భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? విశ్లేషకుల అంచనాల ప్రకారం కనీసం 0.01 నెట్ రన్‌రేట్ సాధించాలంటే కనీసం 77 పరుగుల తేడాతో గెలవాలి. ఉదాహరణకు భారత్ 200 పరుగులు చేస్తే, ప్రత్యర్థిని 123 లోపే కట్టడి చేయాలి. చిన్న తేడాతో గెలిస్తే రన్‌రేట్‌లో పెద్ద మార్పు ఉండదు. అప్పుడు సెమీఫైనల్ ఆశలు మరింత క్లిష్టమవుతాయి. అందువల్ల పవర్‌ప్లే నుంచే దూకుడైన ఆరంభం అవసరం. మధ్య ఓవర్లలో రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవాలి. చివరి ఓవర్లలో ఫినిషర్లు వేగం పెంచాలి. అదే సమయంలో బౌలర్లు ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమన్వయంతో ఆడితేనే భారత్‌కు ప్రయోజనం ఉంటుంది. లక్ష్యాన్ని ఛేదించే పరిస్థితి వస్తే సవాలు ఇంకా పెరుగుతుంది. ఎంత తక్కువ బంతుల్లో లక్ష్యాన్ని చేరుకుంటే అంత మంచిది. ఉదాహరణకు 101 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలో, 121 పరుగులను 8.4 ఓవర్లలో, 141 పరుగులను 10 ఓవర్లలో, 161 పరుగులను 11.3 ఓవర్లలో, 181 పరుగులను 12.5 ఓవర్లలో పూర్తి చేస్తేనే నెట్ రన్‌రేట్ 0.01కు చేరే అవకాశం ఉంటుంది. అంటే సాధారణ ఛేదన సరిపోదు. అత్యంత వేగంగా మ్యాచ్ ముగించాల్సిన పరిస్థితి. ఒకవేళ మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్తే, గెలిచినా నెట్ రన్‌రేట్‌లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు.
సూపర్-8 సమీకరణాలు కూడా ఆసక్తికరంగా మారాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే, దక్షిణాఫ్రికా కూడా మిగతా మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు బలపడతాయి. కానీ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే మూడు జట్లూ నాలుగు పాయింట్లతో సమాన స్థితిలో నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగానే సెమీస్‌కు వెళ్లే రెండు జట్లు ఎంపికవుతాయి.