CT2025: ప్రతీకారం తీర్చుకోవలసిందే
కంగారులపై ప్రతీకారానికి సిద్ధమైన టీమిండియా.. అభిమానులను వెంటాడుతున్న గతం;
మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్‌ను రోహిత్‌సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే. కొందరు కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో ఆస్ట్రేలియా కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.
ఏమి చేయాలనే దానిపైనే మా దృష్టి: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగే సెమీ-ఫైనల్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికలను అమలు చేయడంపై దృష్టి పెట్టామని రోహిత్ చెప్పారు. 'ఒక గ్రూప్‌గా మనం ఏమి చేయాలో మనం ఎంత ఎక్కువగా దృష్టి పెడతామో... అదే మాకు చాలా సహాయపడుతుంది' అని సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. కాగా భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది.
తుది జట్టులో పంత్..?
ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో పంత్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కివీస్ తో జరిగిన మ్యాచులో హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఆడించారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రిషబ్ పంత్‌కు సెమీస్‌లో అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ వికెట్ కీపర్‌గా విఫలమవుతుండడంతో అతని స్థానంలో పంత్ ను తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
అరుదైన ఘనత సాధించిన పంత్
టీమ్‌ఇండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్-2025లో ‘కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకి పంత్ నామినేట్ అయ్యాడు. టీమ్‌ఇండియా క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 21న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఈ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.